యాకోబు జీవితము (యేసు క్రీస్తు యొక్క
శిష్యుడు) గురించి క్లుప్తంగా...
క్రీస్తు శిష్యులు 12 మందిలో యాకోబు గురించి చాలామందికి తెలియదు. యాకోబు గురించి లేఖనాలు ఎక్కువగా చెప్పబడకపోయినా యితడు అపోస్తలులందరిలో ముఖ్యుడుగా
పేర్కొన వచ్చును. క్రీస్తు శిష్యులలో మొదటి హతసాక్షి యితడే.
ఈ యాకోబు యేసు ప్రేమించిన శిష్యుడైన
యోహానుకు అన్న. జాలరి వృత్తిలో
అంద్రెయ, పేతురు, యోహానులు భాగస్వాములుగా ఉండేవారు. యాకోబు తండ్రి జెబదయి. వీరి క్రింద అనేకమంది
నౌకరులు, నావలు ఉండేవి. యేసు
క్రీస్తుతో చిన్న నాటి నుండి
సంబంధమున్నవాడు ఈ యాకోబు. గలిలయ
తీరంపై వెళుతూ క్రీస్తు యిచ్చిన పిలుపును అందుకున్నవాడు.
క్రీస్తుతో యాకోబు సన్నిహితంగా ఉండడం వల్లనే కపెర్నహోములో
పేతురు అత్తగారిని స్వస్థ పరిచినప్పుడు అచట అతడు కూడా
ఉండెను. పేతురు, యోహానులతో పాటు క్రీస్తుతో కూడా
రూపాంతర కొండపైన మరియు గెత్సేమనే తోటలో
యేసు క్రీస్తు సిలువ మరణమునకు ముందు
వేదన అనుభవించు సమయంలో కూడా యాకోబు యేసు
క్రీస్తుతో పాటు ఉన్నాడు. ఏదో
ఒకనాటికి తాను కూడా క్రీస్తువలే
వేదన అనుభవించుట తప్పదని గుర్తించినవాడు. సంఘము అతి చిన్న
వయసులో వుండగా దాని కోసం ప్రాణాలర్పించిన
మొట్ట మొదటి హతసాక్షి.
ఒకనాడు యాకోబు, యోహానుల తల్లి క్రీస్తుతో - అతడు
మహిమలో వచ్చినప్పుడు తన యిరువురి కుమారులను
ఒకరిని కుడివైపున, మరొకరిని ఎడమవైపున కూర్చుండ చేయుమని కోరుకున్నది.
అట్టి యాకోబు క్రీ.శ. 44 లో
హేరోదుచే ఖడ్గంచేత చంపబడ్డాడు.
"దాదాపు అదే కాలమందు రాజైన
హేరోదు సంఘపు వారిలో కొందరిని
బాధపెట్టుటకు బలాత్కార ముగా పట్టుకొని, యోహాను
సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను." అపోస్తలుల కార్యములు 12:1,2
యాకోబును చంపుటకు తీసుకు
వెళ్తుండగా అతనితో పాటు నేరారోపణ చేసిన
వ్యక్తిని కూడా తీసుకు వెళ్లారు.
వధించబడే వ్యక్తి భయంకరుడై ఉంటాడని అతడనుకున్నాడు. కాని యాకోబు ముఖము
చూడగానే, అతని ముఖము గొప్ప
యుద్దాన్ని జయించిన వీరునివలె ప్రకాశిస్తుండడాన్ని చూచి, అతడు ప్రేమించే
రక్షకుడే నిజమైన దేవుడని విశ్వసించి క్రైస్తవునిగా మారిపోయాడు. ఆ కారణంచే యాకోబుతోపాటు
ఆ వ్యక్తి కూడా ఏకకాలంలోనే వధించబడ్డాడు.
క్రీస్తు ఆరోహణ అనంతరం యాకోబు
14 సంవత్సరాలు జీవించాడు. తన జీవిత కాలంలో
అతడు స్పెయిన్ దేశంలో సంఘ నిర్మాణానికి గొప్ప
కృషి చేసినాడు. క్రీస్తును మహిమ పరచుటలో మహత్తర
విజయాలను సాధించాడు.
యాకోబు శిరచ్చేదనముకు చెందిన అద్భుతమైన చరిత్ర యిటీవల స్పెయిన్ చరిత్రలో దొరికింది. శిరచ్చేదముకు పిమ్మట ఆయన శిష్యులు యూదులకు భయపడి, యాకోబు మొండెమును ఎత్తుకుపోయి ఒక దోనెలో ఉంచారు.
ఆ దోనెను స్పెయిన్ కు నడిపించారు. దోనె
ఆగిన తీర దేశాన్ని "లూపా"
అను రాణి పాలిస్తున్నది. ఆమె
కుటిల బుద్దితో పొగరుబోతు ఎద్దులను బండికి కట్టి ఆ బండిపై
యాకోబు మొండెమును ఉంచి తోలించినది. అలా
ఆ మొండెం పోయి ఏ శిథిల
శిలల్లోనో అంతరించి పోతుందని ఆమె ఊహ. కాని
ఆ ఊహకు భిన్నంగా ఎడ్లు
ఆ మొండెమును తెచ్చి రాజసభలో ఉంచినవి. ఆ దైవ నిర్దేశితమైన
మహిమాన్విత కార్యానికి ఆశ్చర్యపడి ఆ రాణి, ఆ
దేశ ప్రజలు క్రైస్తవులుగా మారిపోయినారు. అచ్చట చంద్రకాంత శిలాఫలకములతో
గొప్ప చర్చి నిర్మించబడింది. నేటికి
ఆ ప్రాంతాన్ని లక్షలాదిగా ప్రజలు సందర్శిస్తుంటారు.
అంతేగాక శిరచ్చేదనం గావించబడ్డ జెరుషలేములోను
యాకోబు పేరుపై గొప్ప చర్చి నిర్మించబడింది.
ఈ విధంగా యాకోబు క్రీస్తు కొరకు అనేక ఆత్మలను
సంపాదించి... బ్రతుకుట క్రీస్తు కొరకే - చావైతే లాభమని ఎంచుకొని క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు.
"నీతిమార్గము
ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో
వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు." దానియేలు 12:3.
No comments:
Post a Comment