ఒక బాటసారి ప్రాణగాథ
అతడు ఒక సామాన్యమైన మనిషి. ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి కాలినడకన ప్రయాణమై వెళ్తున్నాడు. ఒకటి లేదా రెండు రోజుల ప్రయాణం. అతను వెళ్లే దారి అంతా రాళ్లు రప్పలు మరియు చిన్న చిన్న కొండలు. అతడు తనలో తాను పాటలు పాడుకుంటూ రాగాలు తీస్తు చాలా ఉల్లాసముగా తన ప్రయాణమును కొనసాగిస్తున్నాడు.

ఇంతలో హఠాత్తుగా ప్రక్కన ఉన్న కొండలలో నుండి ఒక దొంగల గుంపు అతనిమీదకి దూకింది. అసలు ఏ మాత్రం దయా దాక్షిణ్యము లేకుండా అతనిని భయంకరముగా కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులను, వస్తువులను, వస్త్రాలను దోచుకొని కోన ఊపిరితో ఉండగా అతన్ని దారి ప్రక్కన పడేసి వెళ్లిపోయారు.


రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ బ్రతకాలి అనే ఆశతో అతి కష్టం మీద శ్వాస పీల్చుకుంటూ సహాయము చేసే వారి కోసం మూలుగుతూ జీవమరణములతో పోరాడుతూ ఉన్నాడు.

ఇంతలో ఆ వైపుగా ఒక వ్యక్తి రావడం జరిగింది. తాను ఒక నిష్ఠ కలిగిన భక్తిపరుడునని అతని నమ్మకం. అతడు కొన ఊపిరితో వున్న ఆ బాటసారిని చూశాడు. అతడు పాటించే పద్ధతులు, ఆచారసంప్రదాయములు, భక్తి విధానాలు చూస్తే ఖచ్చితంగా సహాయం చేయగలడు అనేలా వున్నాడు. కానీ ఆ భక్తి పరుడు అతన్ని అసలు చూడలేనట్టే నటిస్తూ అతన్ని దాటుకొని ఆ దారికి మరో వైపు నుండి వెళ్లిపోయాడు.

కొన్ని నిమిషాల తరువాత మరొక వ్యక్తి ఆ దారిలో నడచుకుంటూ వచ్చాడు. తాను ఒక మంచి కులము, వంశము, గోత్రమునకు సంబంధించినవాడనని అతని అభిప్రాయం. ఇతడు బహుశా ఆ బాటసారి సహాయం చేయగలడు. కానీ అతనికి అతని కులము, అతని స్థాయి అడ్డు వచ్చాయి. నేను ఏమిటి? రక్తంలో మునిగి ఉన్న వాడి బాధ్యత తీసుకోవడం ఏమిటి? ఇతనికి నాకూ సంబంధం ఏమిటి? నా స్థాయికి తగిన వాడైతే తప్పక సహాయం చేసే వాడిని అని అనుకుంటూ నెమ్మదిగా ఆ మనిషికి దూరంగా నడుస్తూ వెళ్లిపోయాడు.

చివరికి, కొన్ని నిమిషాల తరువాత అదే దారిలో మరొక వ్యక్తి నడచుకుంటూ వచ్చాడు. ఇతను ఎవరో తెలుసా? ఎప్పుడు గొప్ప వాడుగా పిలువబడలేదు. సమాజంలో ఎప్పుడు గుర్తింపు పొందలేదు. ఎన్నో సార్లు అవమానము లు పొందాడు, గేలి చేయబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, ఎవరు అంగీకరించలేనివాడిగా ఒంటరిగా మిగిలిపోయాడు. పేరు ప్రఖ్యాతలు కంటే, కులం, గోత్రం పట్టింపుల కంటే అతనికి తెలసిన ఒకే ఒక పని. ప్రేమించడం!!! ఆపదలో ఉన్నవాళ్లు ఎవరైనా సరే అన్ని మరిచిపోయి సహాయం చేసే వ్యక్తిత్వం అతనిది. ఇతడు ఒక అతిసామాన్యమైన మనిషి.




అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటూ వస్త్రహీనుడుగా, సహాయం దొరకక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రక్తపు మాడుగులో మూలుగుతున్న ఆ బాటసారిని చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతని మీద జాలిపడి దగ్గరకు వెళ్లి నూనె, ద్రాక్షరసము పోసి అతని గాయలుకి కట్లుకట్టి తన వాహనం మీద ఎక్కించి జాగ్రత్తగా చూసుకోవడానికి దగ్గరలో ఉన్న సత్రం కి తీసుకెళ్లాడు. ఆ రోజంతా అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం అతనికి అయినా ఖర్చు అంతా రుసుము చెల్లించి, నేను మరలా వచ్చేవరకు అతనిని శ్రద్ధ వహించాలని వారిని కోరాడు. అంతేకాకుండా అతనికి ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే తాను మరలా వచ్చినప్పుడు ఆ రుసుము ఎంతైనా చెల్లిస్తానని చెప్పి తన మార్గమున వెళ్లాడు... మరలా వస్తాడు... మంచి సహాయకుడు!!!

ఈ కథలో మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.. అందులో కొన్ని...
1) ఆ బాటసారి ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు.
మనిషి జీవితం కూడా ఒక ప్రయాణమే! తల్లి గర్భం నుండి సమాధి గర్భం వరకే ఈ ప్రయాణం అనుకుంటే మనము పొరబడినట్టే!! మానవుడి జీవితం పుట్టుక నుండి మరణం వరకే కాదు. పుట్టుకకు ముందు, మరణం తరువాత కూడా జీవితం ఉంది, అది అనంతమైనది అని గ్రహించాలి. ఉదాహరణకు ఒక చెట్టు గురించి ఆలోచిద్దాం! అది చెట్టు గా మారక మునుపు అధి ఒక విత్తనం. చెట్టు యొక్క జీవితం ముగింపబడినా .. అధి దాని విత్తనం వలన మరొక జీవితాన్ని చూడగలుగుతుంది. విత్తనం భూమిలో దాచిన తరువాత మాత్రమే దానిలోని జీవమును, జీవితమును చూడగలుగుతాము. అలాగే మనిషి జీవం, జీవితం మరణం తరువాత నిత్యము చూడగలం.
అందుకే ఎక్కడ నుండి వచ్చాము ? ఎక్కడికి వెళుతున్నాము ? అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. మానవుని ఆత్మ, పరమాత్మ నుండి వచ్చినది గనుక పరమాత్మను చేరాలి. ఈ మధ్యలో అనగా పుట్టుకకు (వచ్చుటకు) - మరణించుటకు (వెళ్లుటకు) మధ్యలో జీవితాన్ని సరైన మార్గంలో కొనసాగించాలి. అప్పుడే మనం సరైన గమ్యాన్ని చేయగలము. కొందరు మహానుభావులు ఇలా చెప్పారు - మానవుడు ఒక ఆత్మ! ఆదర్శమైన జీవితం సాగిస్తే మహాత్మగా రూపు దాల్చుకుంటాడు!! ఆత్మీయంగా దైవత్వమును పొందుకుంటే పరమాత్మలో లీనమవుతాడు!!! అవును. దేవుని యొద్ద నుండి దేవుని చేత పంపబడిన మనము, దేవుని కొరకు దేవుడు చూపిన సరైన త్రోవలో నడిచి దేవుని తేజస్సులో చేరాలి. తద్వారా మనసుకి, ఆత్మ కి, శరీరానికి సంతోషం, ఆనందం చూస్తాము.
ఇలా గమ్యమును(మోక్షమును/ నిత్య జీవమును) చేరిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు!!!
"నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;
ఆయన (యేసు) సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.
ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను
దేవదూతలకు కనబడు
రక్షకుడని జనములలో ప్రకటింపబడెను
లోకమందు నమ్మబడెను
ఆరోహణుడై తేజోమయుడయ్యెను."
(1 తిమోతి 3:16)
ప్రభువైన యేసు క్రీస్తు పరలోకము నుండి పంపబడి తిరిగి పరలోకమునకు ఎక్కి వెళ్లాడు.
" దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." (యోహాను సువార్త 3:16)
2) దొంగల చేతిలో చిక్కుబడ్డాడు
మనం వెళ్లే మార్గం సరైనది కానపుడు మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపములో, శాపములో, వ్యాధి బాధలలో, చివరకు మరణంలో చిక్కుకుపోతాము.
" మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.
ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును,ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును." (గలతీ 6:7,8)
మనము చేసే క్రియలనుబట్టే ప్రతిఫలాన్ని అనుభవిస్తాము. అందుకే సరైన గమ్యం చేరడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. అధి దేవుడు చూపిన మార్గం ఐతే మరణం నుండి తప్పించబడతాము.
" నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫల మిచ్చును." (యోబు 34:11)
"నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను". (కీర్తన 32:8)
" బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను." (జెకర్యా 9:12)
3) నిష్ఠగల భక్తిపరుడు, గొప్ప గోత్రం గలవాడు, అతి సామాన్యమైన వ్యక్తి
నిష్ఠగల భక్తిపరుడు:
భక్తి? భక్తి అంటే మనకు నచ్చిన విధంగా, మన సంతృప్తి కోసం చేసేది కాదు, దేవుడు మెచ్చిన విధంగా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేసేదే భక్తి!
" తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే." (యాకోబు1:27)
"సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది." (1 తిమోతికి 6:6)
" పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను." (మార్కు12:33)
గొప్ప గోత్రం గలవాడు:
కుల బేధం, మత బేధం, వర్గ బేధం, ప్రాంతీయ భేధములు యేసు క్రీస్తు ఖండిస్తున్నాడు.
" అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా(నరకకుమారునిగా) చేయుదురు." (మత్తయి 23:15)
"మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు." (తీతుకు3:10,11)
"ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు."(రోమా 3:23)
" యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు." (రోమా10:12)
4) రుసుము చెల్లించిన - మంచి సహాయకుడు
ఇతను యేసు క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాడు. యేసు క్రీస్తు కూడా మన జన్మతః వచ్చిన పాపమును, క్రియల వలన వచ్చిన పాపములను తన అమూల్యమైన రక్తమును రుసుముగా చెల్లించి మనలను విమోచించారు. ఆ మంచి సహాయకుడు అయిన యేసు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న, ఏ పాపము లో చిక్కుకున్న, ఏ శరీర ఆశలలో చిక్కుకున్న నిన్ను విడిపించుటకు సమర్ధుడు.
" మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను." (మత్తయి 20:28)
"ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమో చింపలేడు
వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు
వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే." (కీర్తన49:7,8,9)
" దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది." (ఎఫెసీ1:7)
ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. (కొలొస్సి 1:14)
ప్రియ సోదరి, సోదరుడా!
నీ పాపమునకు యేసు శిలువలో ప్రాణమును అర్పించి పరిహారము చెల్లించాడు. నీ అతిక్రమములకు తన రక్తము ప్రోక్షించి విమోచించాడు. మరలా వచ్చి నిన్ను సంపూర్ణంగా విమోచించి నిత్య జీవమును అనుగ్రహిస్తాడు!
నువ్వు విశ్వసించినట్లైతే దేవుని మహిమ చూచెదవు!!!
మీ ప్రార్థన అవసరాలకు మమ్మును సంప్రదించండి:
No comments:
Post a Comment