Thursday, 20 September 2018

విస్తారమైన దీవెన

                     విస్తారమైన దీవెన

         నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు  నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.   (మలాకీ 3: 10)
             ఈ లోకంలో వున్న ప్రతి వ్యక్తి తన స్వబుద్దిని ఆధారం చేసుకుని అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఈ లోకనాధుడైన సాతాను యొక్క ఉచ్చులో సులువుగా చిక్కుకుపోతున్నారు. అలాకాక నీవు అత్యధికంగా అభివృద్ధి చెందాలి అంటే దేవుడిచ్చే విస్తారమైన దీవెనను అనుభవించాలి అంటే 
"నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము".(సామెతలు 3: 5) నరుల వలన కాని, రాజుల వలన కాని నీకు ప్రయోజనము కలుగదు గాని "యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, "దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు". (రోమా10: 9) అప్పుడు  ప్రభువైన యేసుక్రీస్తు  నీ ప్రాణమును, ఆత్మను , శరీరమును  దుష్టుని నుండి, కీడు నుండి రక్షిస్తారు. సూటిగా చెప్పాలంటే నీకు కలిగిన రక్షించుటకు యేసుక్రీస్తు సమర్ధుడు. అయితే నీవు మొదట అయన చెప్పినట్టు చేయాలి.
  *యేసు ఏమి చెబుతున్నారంటే:*
     "నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి"(మలాకీ 3:10).పై వచనమును జాగ్రత్తగా పరిశీలించినట్లయితే - దేవుడు తన మందిరములో ఆహారముండాలని అనగా సమృద్ధి అనేది వుండాలని ఆశిస్తున్నారు. అందుకొరకు పదియవ భాగమంతయు అనగా కొన్నింటిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. "మీ దేహము దేవుని వలన మీకనుగ్రహింపబడి,  మీలోనున్న పరిశుదాత్మకు ఆలయమైయున్నది". (1 కొరింధీ 6:19)  పై వచన ప్రకారం మీ దేహమే  దేవుని మందిరం. మీ జీవితమే దేవుని ఆలయం. నీ జీవితంలోకి ఆ కొన్నింటిని తీసుకొని వస్తే "ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు". ఆ విస్తార దీవెన పొందాలంటే మందిరంలోకి (అనగా నీ జీవితంలోకి) ఏమి తీసుకువెళ్లాలి?
I) మహిమ
II) ప్రార్ధన
III) విశ్వాసం
*I) మహిమ:-* "మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి'.(1 కొరింధీ 6:20) పై వచన ప్రకారం దేవుని మందిరంలో అనగా నీ జీవితంలో మహిమపర్చడం అనేది వుండాలి. ఎందుకంటె మహిమ పరిచే వారి మార్గాలు(జీవితం) దేవుని స్వాధీనంలో వుంటాయి. మహిమపరిచేవారే దేవుని రాజ్యాన్ని, శక్తిని భూమి మీద ప్రత్యక్షపరచగలరు. మహిమపరిచేవారే సాతానుని చిత్తుగా ఓడించగలరు. ప్రియా పాఠకా! నీవు దేవుని ప్రతివిషయమునందు (మేలైన, కీడైన) ఎల్లప్పుడూ మహిమపరిచినచో నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘములో సమృద్ధి అనేది నీవు చూడగలుగుతావు తద్వారా విస్తారమైన దీవెనను పరము నుండి నేరుగా పొందగలుగుతావు.
1) పౌలు, సీలలు:- "అయితే మధ్యరాత్రివేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.(అపొ.కార్యములు 16:25,26).

మహిమ పరచిన పౌలు, సీలలు నిమిత్తం దేవుడు భూమిని కంపింపచేసాడు. చెరసాలలను బ్రద్దలు చేసాడు. భండకములను తెంచాడు. అవును నీ జీవితంలో 'మహిమ' అనేది ప్రవేశపెడితే నీ కొరకు దేవుడు ఏమైనా చేయుటకు  సిద్ధంగా వున్నాడు.
2) ఇస్సాకు:- "సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి" (ఆది 24:63) దేవుని ప్రేమను స్మరించే ఇస్సాకు జీవితంలో 'మహిమ' అనేది వున్నది గనుక దేవుడు అతనిని విస్తారంగా దీవించాడు.
i) ధ్యానించిన ఇస్సాకు జీవితంలో దు:ఖమనేది మరల కనబడనంత దూరంగా పారిపోయింది. (ఆది 24:67)
ii) ఇస్సాకు దీవిస్తే దీవెన, శపిస్తే శాపం (ఆది 27:29,   )
iii) కరువులో కూడా విత్తనం వేసి నూరంతల ఫలమును (సమృద్ధిని) అనుభవించాడు (ఆది 26:12)
iv) 'ఇస్సాకు దేవుణ్ణి' అని దేవుని వలన సాక్ష్యం పొందాడు (నిర్గమ 3:16).

II) ప్రార్ధన:- "నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును" (మార్కు 11:17)  పై వచన ప్రకారం దేవుని మందిరంలో అనగా నీ జీవితంలో 'ప్రార్ధన' అనేది ఖచ్చితంగా వుండాలని ఆశపడుతున్నాడు. 'ప్రార్ధన వలనను తప్ప మరి దేని వలనను ఎటువంటిడి వదిలిపోవుట అసాధ్యమని' యేసు తన శిష్యులతో చెప్పారు. ఈ క్రైస్తవ పోరాటంలో సమస్యలనైనా, సాతానైనా  జయించాలంటే ప్రార్ధన అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరు చేతపట్టుకోవాలి పరిస్థితులను మార్చేదే ప్రార్ధన దేవుని క్రియలను ప్రత్యక్షపరిచేదే ప్రార్ధన. ఇది వెన్నపూస వంటిది - ఇది లేనివారు తమ పనులు తాము చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడుతుంటారు.  ఇతరులకు భారమైపోతారు. సానుక ప్రియా సోదరా/సోదరి ఈ రోజే నీవు ప్రార్ధన అనే ఆయుధాన్ని చేతపట్టుకో! విస్తారమైన దీవెనను పొందుకో!
1)మోషే:- "యెహోవా మోషేతోనీవేల నాకు మొఱ పెట్టుచున్నావు?  నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.(నిర్గమ 14: 16) ప్రార్థన అనేది మోషే జీవితంలో వుండుట వలన సముద్రాన్ని చీల్చగలిగాడు.
సమ్సోను  అయితే సింహాన్నే చీల్చగలిగాడు. అవును నీ జీవితంలో ప్రార్ధన అనేది వుంటే ఎటువంటి సమస్యనైనా  నీవు  చీల్చగలవు. పరిస్థితిని  గడగడలాడించగలవు. శాసనాన్ని తారుమారు చేయగలవు.
2) దానియేలు:- " అతడు రాజు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి - జీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను. అందుకు దానియేలు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను". (దానియేలు 6:20 ,21,22)
A) దానియేలు కొరకు సింహాళ్ళ నోళ్లను దేవుడు మూయించాడు  (దానియేలు 6:22)
B)  ప్రార్ధించే దానియేలు కొరకు తన దూతను వెంటనే పంపాడు  (దానియేలు 6:22)
C) రారాజు సహితం దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసాడు (దానియేలు 2:46)  

III)విశ్వాసం:"విశ్వాసం లేకుండా దేవునికి యిస్టుడై యుండుట అసాధ్యము" (హీబ్రీ :11:6) అసాధ్యమైనది సాధ్యపరిచేదే విశ్వాసం. లేనివాటిని ఉన్నట్టుగా చూపేదే విశ్వాసం. తనయందు విశ్వాసముంచు వారినెవరిని ఆయన సిగ్గుపరచరు"నా యందు  విశ్వాసముంచువాడు నేను చేసిన క్రియలు చేయగలడు వాటి కంటే మరి గొప్పవియయు చేయగలడు"(యోహాను:14:12) అని యేసుక్రీస్తు నమ్మదగిన వాగ్దానాన్ని మనకి యిచ్చారు. దేవుని మందిరమైన నీ జీవితానికి  యిటువంటి విశ్వాసాన్ని తీసుకువస్తే దేవుడు నిన్ను విస్తారంగా దీవిస్తాడనుటలో సందేహం లేదు.
వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;
అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.
(హెబ్రీయులకు 11: 33,34)
విశ్వాసం ద్వారా ఇశ్రాయేలీయులు పైన చెప్పబడిన దీవెనను అనుభవించగలిగారు. ఈ పత్రిక చదువుతున్న ప్రియ పాఠకా ' దేవుడు చెప్పినట్లుగా నీ జీవితంలోకి మహిమ,ప్రార్ధన, విశ్వాసం అనేవి ప్రవేశ పెడితే " ఆకాశపు వాకిండ్లు విప్పి , పట్టజాలనంత  విస్తారముగా దీవెనలు " కుమ్మరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో సిద్ధంగా ఉన్నారు. మరి నీవు సిద్ధమా  ?
         - ప్రభువు సేవలో ప్రఫుల్ల -

No comments:

Post a Comment

Jesus in the books of the Bible

  In  Genesis , I was the Word of God, creating the heavens and the earth. In  Exodus , I was the Passover Lamb, whose blood was sprinkled o...