యేసుకి ఏమియ్యాలి...?
" నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము" (సామెతలు 23:26) అని చేయి చాచి పిలుచుచున్న పరిశుద్దుడైన యేసుక్రీస్తు నామమున పత్రికా పాఠాoకులకు శుభవందనములు తెలుపుచున్నాను.
దేవుడు మానవుని సృష్టించుటకు కారణం ఏమిటి? మానవుడు తన చిత్తమును మాత్రమే నెరవేర్చాలని, తన సన్నిధిని నిలుచుండి తనను మహిమపరచాలని దేవుని ఉద్ధేశ్యమైయున్నది. అవును ప్రియులారా ! దేవుడు మానవుని నుండి ఎంతో విలువైనదేదో ఆశిస్తూ అది దొరికినప్పుడు అతనిని వర్ణింపశక్యముకాని మేలులతో నింపాలని తలుస్తున్నాడు. ప్రాణమును సహితము అర్పించేంతగా ప్రభువైన యేసు నిన్ను నన్ను ప్రేమిస్తుంటే యేసుకి ఏమియ్యాలి అని ఆలోచించేవారే కనిపించట్లేదు. అయితే దేవుడు ఈ లేఖతో నిన్ను పిలుస్తున్నాడు.
" నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము" (సామెతలు 23:26) ఇక్కడ దేవుడు హృదయమును తనకు యిమ్మని అడుగుచున్నాడు. అయితే హృదయము అన్నింటికంటే మోసకరమైనది కదా ! ఘోరమైన వ్యాధిగలది కదా! లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును, జారత్వములును, దొంగతనములును,
నరహత్యలును, వ్యభి చారములును, లోభములును, చెడుతనములును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును." (మార్కు 07:21,22). ఇంత భయంకరమైన పాపములు వున్న ఈ హృదయమును దేవునికిస్తే దేవుడు స్వీకరిస్తాడా ? స్వీకరించడు. అయితే "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును." (1 యోహాను 1:9). గనుక ఇటువంటి హృదయమును నీవు యిచ్చినట్లయితే వర్ణింపశక్యం కాని దీవెనలతో నింపుతాడనుటలో సందేహం లేదు. అయితే దేవునికి హృదయమివ్వడం అంటే ఏమిటి ? "స్థలమియ్యుడి" (మత్తయి 09:24) ఇక్కడ హృదయమివ్వడం అనగా మన హృదయంలో చోటివ్వడం, స్థలమియ్యడం అని అర్ధం. మరి స్థలమియ్యడం అనగా? ప్రియా సహోదరి సహోదరుడా నీవు నీ దినచర్యలో దేవున్ని స్తుతించుటకు, ప్రార్ధించుటకు, ధ్యానించుటకు, సమయమివ్వగలిగితే దేవునికి నీ హృదయమున స్థలమిచ్చినట్లే అనగా నీ హృదయం దేవునికి ఇచ్చినట్లే. ప్రతి మోకాళ్ళు యేసుక్రీస్తు నామమున వంగాలి . ప్రతి ఒక్కరు దేవునికి స్థలమియ్యలి. నీవు దేవునికి నీ హృదయమందు స్థలమియ్యలేకుంటే (అనగా సమయమివ్యలేకుంటే) పరలోకంలో నీకు స్థలముండదు. దేవునికి తన హృదయమందు స్థలమిచ్చిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. అతను ఎవరంటే ..?
I ఇస్సాకు :- ఇస్సాకు దేవుని కొరకు సమయమిచ్చాడు.
" సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి " (ఆది 24:63) ఇస్సాకు జీవితమును పరిశీలించినట్లయితే అతడు దేవుని ధ్యానించడానికి, దేవుని ప్రేమను స్మరించడానికి 'సాయంకాలము' అను ఒక సమయమునిచ్చి , 'పొలము' అను ఒక స్థలమును దేవునికి యివ్వడం జరిగింది. యేసుక్రీస్తు కూడా రాత్రంతా ఏకాంత ప్రార్ధన చేయడానికి ఒలీవ కొండను ఏర్పరుచుకొని ఆలా దేవునికి స్థలమిచ్చి అనగా సమయాన్ని యివ్వడం మూలంగా దేవుడు 'యేసు' ద్వారా అనేకమార్లు మహిమపరచబడ్డారు. ఇస్సాకు కూడా అనేక విధాలుగా ఆశీర్వాదించబడ్డాడు. ఏ విధంగా నంటే
(1) దేవునికి సమయమిచ్చిన ఇస్సాకు జీవితంలో దుఃఖమనేది మరల కనిపించనంత దూరంగా పారిపోయింది. (ఆది 24:67)
సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును
బూడిదెకు ప్రతిగా పూదండను
దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును
వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. (యెషయా 61:3)
అవును ప్రియులారా ! నీవు దేవునితో సహవాసం చేయుటకు, ఆయనను సమీపించుటకు సమయమిచ్చి నీ హృదయమునర్పించినట్లయితే ఇస్సాకు అనుభవించిన రీతిలో దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, చీకటికి ప్రతిగా ప్రకాశవంతమైన వెలుగును నీ జీవితంలో అనుభవించగలవు.
(2) దేవుడు అతనితో మాట్లాడేవాడు (ఆది 26:24)
ప్రార్ధించి, దేవున్ని స్మరించే ఇస్సాకు తో దేవుడు మాట్లాడేవాడు. ఇక్కడ దేవుడు ఇస్సాకుకు ఎంతో సమీపంగా వున్నట్లుగా మనం చూస్తున్నాము. నేటి దినములలో కూడా దేవుడు పరిశుద్దత్మునునిగా మనలో నివసిస్తూ మనకు ఎంతో సమీపంగా ఉంటున్నాడు." ఆధరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుధ్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయును " ( యోహాను 15:26) " నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను." (కీర్తనలు 32:8)
అవును ప్రియులారా! నీకు అత్యంత సమీపంగా వున్న పరిశుధ్దత్మకు నీ హృదయమందు చోటిచ్చి దేవునికి నీ హృదయము నప్పగించినట్లయితే నీవు నడువవలసిన మార్గం ఆయన నీకు బోధిస్తారు. తద్వారా నీవు పాపము నుండి పరమునకు నడిపింపబడతావు.
II అధికారి;- అధికారి దేవునికి స్థలమిచ్చాడు.
" ఒక అధికారి యేసు యొద్దకు వచ్చి నా కుమార్తె చఁగనిపోయినది దయచేసి ఆమెను బ్రతికించుమని యేసుని వేడుకొనినపుడు ఆ అధికారి తన యింట యేసుకి స్థలమియ్యగా.....
1) " చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పి ఆమెను లేపెను". (మత్తయి 9:25)
పై వచనమును జాగ్రత్తగా పరిశీలిస్తే నీవు నీ హృదయమందు దేవునికి స్థలమిస్తే నీవు నిద్రించుచున్నాను దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. ఎందుకనగా "ప్రవక్త" గా తాను ఏర్పరచుకొనిన 'యోనా' ను "నీవు లేచి ప్రార్ధించుము" (యోనా 1:6) అని లేపాడు.
అవును నీవు నీ హృదయమందు దేవునికి చోటిస్తే నీవు మెలకువగా వుండక నిద్రపోయిన సమయంలో అయిన నిన్ను మేల్కొలిపి విశ్వాస,ప్రేమ,రక్షణతో నింపి పగటివారిగా నిన్ను చేస్తాడు.(1 ధెస్య 5:8)
(2). "జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్ళి, ఆమె చెయ్యి పట్టుకొనగా ఆమె లేచెను" (మత్తయి 9:25)
చివరగా నీవు ఎపుడైతే నీ హృదయమును దేవునికిచ్చుటకు సిద్ధపడి, నీ పాపములును ఒప్పుకుని విడిచిపెడతావో అప్పుడే నీ హృదయంలో శరీరక్రియలను బయటకు పంపివేసి, నీ హృదయంలోకి వచ్చి, నిన్ను చేయిపెట్టి అంతం వరకు నడిపించి, మృతులలోనుండి సజీవంగా లేపుతాడు సహోదరుడా, సహోదరి ! యేసుకి ఏమిస్తున్నావు? ఏమియ్యగలవు ? ఇప్పుడైనా నీ హృదయమును దేవునికి సమర్పించు. దేవునికి నీ హృదయమును సమర్పించి పైన వివరించబడిన అనుభవములను కలిగియుందువు గాక ! ఆమెన్!!
--- ప్రఫుల్ల
No comments:
Post a Comment