ఎవరు బలవంతులు...?
"యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది; మీరుదుష్టుని జయించియున్నారు" (1యోహాను 2:14)
ఈ కడవరి దినములలో ప్రభువైన యేసుక్రీస్తు యవ్వనులపై ప్రత్యేకదృష్టిని నిలుపుతున్నారు. దేవుడు వీరిని రగులుచున్న అగ్ని జ్వాలలుగా ప్రజ్వలింపచేయాలని ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలోనే మన శత్రువైన సాతాను శరీరాశ, నేత్రశ, జీవపుడంబము (1యోహాను 2:16) అను మూడు అగ్నిబాణాలను యవ్వనుల మీదకు పంపి గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. (1 పేతురు 5:8)
ఇటువంటి తరుణంలో ఈ పత్రిక చదువుతున్న సహోదరీ, సహోదరుడా. "పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడు" (న్యాయా 6:12) అని యవ్వనుడైన గిద్యోనుని బలపరిచిన దేవుడు ఇప్పుడు ఈ పత్రికద్వారా నీవు బలవంతుడవని మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు.
"యౌవనస్థులారా, మీరు బలవంతులు" అని లేఖనం చెబుతుంది.
యౌవనస్థులు ఎలా బలవంతులయ్యారు?
దేవుని వాక్యము వారి యందు నిలిచియుండుట ద్వారా అనగా బలవంతుడైన యేసుక్రీస్తు వారి యందు, వారి ఆత్మల యందు నిలిచిఉండటం ద్వారా యవ్వనస్థులు బలవంతులయ్యారు. "మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు." (1యోహాను 4:4) " నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము" (సామెతలు 20:27) పై వచన ప్రకారం ప్రియా సహోదరీ, సహోదరుడా, నీలో వున్నా "జీవాత్మ" బలవంతుడైన దేవుని ఆత్మ. గనుక నీలోవున్న వాడు లోకంలో వున్నా వాని కంటె శక్తిమంతుడు. గనుక "ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. (సామెతలు 20:27)
బలవంతులైనవారు ఏం చెయ్యాలి?
"బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును." (లూకా 11:21)
బలవంతులైన వారు ఆయుధములు ధరించుకొనవలెనని పై వచనం మనకు బోధిస్తుంది. అవును (ఎఫెసీ 6:11-17) లో ఆ ఆయుధములు ఏమనగా మీ నడుమునకు సత్యమను దట్టి, నీతియను మైమరువు, పాదములకు సమాధాన సువార్తవలనైన జోడు, విశ్వాసమను డాలు, రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గము. ఇవన్ని బలవంతులు ధరించుకోవలసిన ఆయుధములు. క్లుప్తంగా చెప్పాలంటే సర్వాంగకవచమును అనగా పరిశుద్ధాత్మను ధరించుకోవాలి. ఇది ధరించుకొనినప్పుడు మాత్రమే నీవు దుష్టుని అగ్ని బాణమును ఆర్పుటకు శక్తిమంతులమవుతావు.
అసలు ఎవరు బలవంతులు ?
1) ప్రార్ధించేవారే బలవంతులు :-
"అందుకాయన - ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను." (మార్కు 9:29)
ఇక్కడ యేసుక్రీస్తు నుండి అధికారం పొందిన తర్వాత శిష్యులు ఒక దెయ్యమును తరుముటకు ప్రయత్నించగా వారు దానిని జయించలేకపోయారు. అయితే యేసు - "మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను." (మార్కు 9:25,26) ఈ విధంగా యేసు దెయ్యమును తరిమిన తర్వాత యేసు ఏకాంతంగా వున్నప్పుడు శిష్యులు ఈ విధంగా అడిగారు. "మేమెందుకు ఆ దెయ్యమును వెల్లగొట్టలేకపోతిమి. మేమెందుకు దుష్టున్ని జయించే బలవంతులముకాలేకపోయాము ? నీవు ఎందుకు బలవంతుడవై దుస్టుని జయించావు? అని ప్రశ్నించగా యేసు - ప్రధానవలననే ఇది సాధ్యమని జవాబిచ్చారు.
ఓ యవ్వనుడా గమనిస్తున్నావా ? యేసు పగలంతా రాజ్యసువార్తను ప్రకటించి రాత్రంతా ప్రార్ధించేవారు. యవ్వనుడైన యేసుక్రీస్తు జీవితంలో " ఏకాంత ప్రార్ధన" అనేది వున్నది గనుకనే దుష్ఠుని జయించగలిగారు. అవును, ఎవరి దినచర్యలో అయితే ఏకాంత ప్రార్ధన అనేది వుంటుందో వారే బలవంతులు. వారు పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని తప్పకుండా జయించగలరు.
2) ఆరాధించేవారే బలవంతులు :-
" యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను." (యెహొషువ 6:20)
ఇక్కడ యాజకులు బూరలు ఊదుతున్నారు. ఈ బూరలు ఊదడం అనేది విజయానికి సంకేతానికి వుంది. విజయమియ్యబోయే ఆ దేవున్ని ఆ ప్రజలు ఆర్భాటముగా స్తుతించి ఆరాధించుట ద్వారా యెరికో ప్రాకారాన్ని కూల్చారు. అదేవిధంగా బంధకములలో వున్నాను విడిపించుటకు సమర్ధుడైన యేసుక్రీస్తును పౌలు, సీలలు కీర్తనలతో దేవున్ని మహిమపరచగా "అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. (అపొ కార్యము 16:25,26) పై వచనము ద్వారా ఆరాధించేవారే బలవంతులని స్పష్టంగా తెలిజేయబడుతుంది.
ప్రియా సహోదరుడా, సహోదరి చాల మంది విజయం పొందిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత, బంధకములనుండి విడుదల పొందిన తర్వాత, నీవు కొన్ని విషయాలను గ్రహించి, పాటించాలి. అదేమంటే నీవు విజయం పొందకమునుపే విజయమివ్వగల దేవున్ని ఎలుగెత్తి ఆరాధించు. ఒకవేళ నిన్ను చీకటి కమ్ముకొనినను, పాపము తరిమినను, ఎవరు విడిపించలేనంత బంధకములలో నీవు చిక్కుకొనినను నీవు భయపడనవసరం లేదు. వాటన్నిటినుండి నిన్ను విడిపించుటకు సమర్ధుడైన యేసుక్రీస్తును ఎలుగెత్తి స్తుతించు. నీ సమస్యలను పునాదులతోసహా పెకిలించు, తద్వారా నీ మార్గములో అడ్డుగా వున్నా యెరికో ప్రాకారమునుకూల్చు.
3) విశ్వాసముంచే వారే బలవంతులు:-
"అందుకు - యేసు వారితో ఇట్లనెను - మీరు దేవునియందు విశ్వాసముంచుడి.
ఎవడైనను ఈ కొండను చూచి - నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు మని చెప్పి, నీ మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (మార్కు 11:22,23)
ప్రియులారా! విశ్వాసమనేది క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నారు. ఆలాగునమ్ముట మంచిదే; దయ్యములు కూడా ఆలా నమ్మి వణుకుచున్నాయి. (యాకోబు 2:19) "ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము." (యాకోబు 2:26). గనుక ఈ అంత్యదినములలో క్రియలు చూడగలిగే విశ్వాసం కొరకు ప్రయాసపడాలి. ఎందుకనగా విశ్వాసముంచువారే దుష్టుని జయింపగల బలవంతులు. ఇటువంటి విశ్వాసం నీవు కలిగివున్నట్లయితే కొండా వంటి మహా భయంకర సమస్యలు నీకెదురైనా ఆ సమస్యను నీవు ఆజ్ఞాపించగా అది ఎత్తబడి దూరంగా పడవేయబడుతుంది. "దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. (యాకోబు 4:7)
చివరగా దేవుని యందు ప్రియమైన యువతీ, యువకుడా! నీవు దుష్టున్ని తరిమే బలవంతుడవు కావాలి. దుష్టుని వాని దూతలను ఎదిరించగల ప్రార్ధనవీరునిగా, యెరికో వంటి ప్రాకారాలను కూర్చే ఆరాధికునిగా, కొండలను సహితం పెకలించగల విశ్వాసిగా నీవు రూపాంతరం చెందాలి. అట్టి పరాక్రమ బలాఢ్యునిగా దేవుడు నిన్ను స్థిరపరచును గాకా!
Amen!!
# Sis. Praphulla #